విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై విచారణకు నో.. పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు

  • నటుడు విజయ్ ఎన్నికల అఫిడవిట్‌పై విచారణ కోరిన పిటిషన్‌ను కొట్టివేసిన‌ మద్రాస్ హైకోర్టు 
  • ఆర్థిక వివరాలు తప్పుగా చూపారని, కొన్ని అంశాలు దాచిపెట్టారని పిటిషనర్ ఆరోపణ‌
  • కోట్ల రూపాయల రుణాలు ఇస్తూ, తనకు అప్పులు లేవని ప్రకటించడంపై పిటిషన్‌లో అభ్యంతరం
  • విజయ్‌పై దాఖలైన ఇలాంటి మరో పిటిషన్ హైకోర్టులో ఇంకా విచారణ దశలోనే ఉన్న వైనం
నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ చీఫ్ విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్‌లోని ఆర్థిక వివరాలపై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

వివరాల్లోకి వెళితే... చెన్నైకి చెందిన ఎంపీ వెంకటేశ్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విజయ్ తన ఫారం 26 అఫిడవిట్‌లో ఆర్థిక వివరాలను తప్పుగా చూపారని, కొన్ని కీలక విషయాలను దాచిపెట్టారని పిటిషనర్ ఆరోపించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు, అనుబంధ సంస్థలకు కోట్ల రూపాయల విలువైన రుణాలు ఇచ్చినట్లు చూపిన విజయ్, అదే సమయంలో తనకు ఎలాంటి అప్పులు లేవని ప్రకటించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన భార్యకు రూ.12 కోట్లకు పైగా రుణం ఇచ్చినట్లు పేర్కొనడం వంటి లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 33A ప్రకారం అభ్యర్థులు పూర్తి, పారదర్శకమైన సమాచారం ఇవ్వాలని, కానీ విజయ్ సమర్పించిన వివరాలు ఓటరుకు సమాచారం తెలుసుకునే హక్కును కాలరాసేలా ఉన్నాయని పిటిషనర్ వాదించారు. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎన్నికల సంఘంతో ప్రాథమిక విచారణ జరిపించాలని కోరారు.

అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి సంజయ్ వి. గంగాపూర్వాలా ధర్మాధికారి, జస్టిస్ అరుళ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం, పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండానే కొట్టివేసింది. ఎలాంటి విచారణకు ఆదేశించకుండానే పిటిషన్‌ను తిరస్కరించింది.

కాగా, విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లోని అవకతవకలపై దాఖలైన మరో పిటిషన్ ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉంది. ఆ కేసులో రూ.100 కోట్లకు పైగా వివరాలు వెల్లడించలేదని ఆరోపణలు రావడంతో కోర్టు ఈ నెల‌ 20న కేంద్ర ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. విజయ్ 2024లో ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని స్థాపించి, 2026 ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే. 

Vijay
Madras HC
plea
election affidavit

More Telugu News